- జీబ్రా చేపలు.
* తెలుపు నలుపు చారలతో ఉండే జీబ్రాల గురించి తెలుసు. మరి జీబ్రా చారలతో ఉండే ఈ చేప నీళ్లలో మిలమిల మెరిసిపోతూ భలే ముచ్చటగా దేహంపై నీలం రంగు చారలు అచ్చం జీబ్రా చారల్లానే ఉంటాయి. అందుకే వీటిని జీబ్రా చేపలంటారు. అసలు ఈ చేపపై చారలు ఎందుకు ఏర్పడతాయో శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు.
* దేహంపై ఎవరో గీసినట్టే రంగు రంగుల్లో ఉండే ఈ చారల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరీక్షలు చేశారు. చివరకు ఈ చేపల్లోని వర్ణ కణాల వల్లే ఈ చారలు ఏర్పడతాయని తెలిసింది.
* ఈ చేపల్లో నలుపు, పసుపు రంగు కణాలు, వెండి వర్ణంలో ఉండే సిల్వరీ కణాలు ఉంటాయి. ఇవి పుట్టిన వెంటనే మెదడు నుంచి పసుపు కణాలు పుట్టుకొచ్చి చర్మాన్ని కప్పివేస్తాయి. తర్వాత రెండు, మూడు వారాలకు అవి పెరుగుతూ విస్తరిస్తాయి. తర్వాత వెన్నెముక నుంచి సిల్వరీ, నలుపు కణాలు ఏర్పడి చర్మం పొరల్లో కలిసిపోతూ చారల్ని ఏర్పరుస్తాయి. ఈ కణాలకు రంగు, ఆకారం మార్చే శక్తి కూడా ఉంటుంది. దాంతో శరీరంపై బంగారు వర్ణం చారల మధ్య నీలం రంగు వచ్చేలా చారల్ని ఏర్పరుస్తాయి. ఈ కణాలే చారలకు కారణమన్నమాట.
* ఈ పరిశీలన వల్ల పులి, జీబ్రా వంటి వాటిల్లో వాటి రంగు, చారల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
* జీబ్రా చేపల్ని ఎన్నో పరిశోధనల కోసం వాడతారు. ఎందుకంటే వీటి చర్మం పారదర్శకంగా ఉండి, మైక్రోస్కోప్ కింద చక్కగా కనిపిస్తుందిట. అంతేకాదు మన మెదడు జెనెటిక్ కోడ్‌తో పోలిస్తే జీబ్రా చేప మెదడుకు 90 శాతం సరిపోలుతుందిట.
* బంగారు, వెండి వర్ణంలో ఆకర్షణీయంగా ఉండే ఈ చేపలు ఎక్కువగా మన దేశంలోనే కనిపిస్తాయి. మంచి నీళ్లలో మాత్రమే ఉంటాయి. భలే అందంగా ఉండడంతో ఎక్కువగా అక్వేరియాల్లో పెంచుతుంటారు.
* ఇవి మొప్పల్ని, గుండె కండరాల్ని కూడా పునరుత్పత్తి చేసుకోగలవు. మనలానే వీటికి వెన్నెముక ఉంటుంది.
* వీటిల్లో మగ చేప జత కట్టిన ఆడ చేపతోనే ఉంటుందిట.
* సన్నగా ఉండే ఇవి రెండున్నర అంగుళాల పొడవుంటాయి.
- ============================