Thursday, January 9, 2014

Torvosaurus gurney Dynosar,టార్వోసరస్ గర్నీ డైనోసార్‌





డైనోసార్‌ సంగతులు - ఈ మధ్యే  ఓ కొత్త డైనోగారు బయటపడ్డారు. మరి దాని ప్రత్యేకతేంటో తెలుసా? ఐరోపా ఖండంలోనే అతి పెద్ద మాంసాహార డైనో ఇదేనట. అంతేకాదు భూమ్మీద బతికిన అన్ని అతిపెద్ద మాంసాహార డైనో జాతులకన్నా ముందు బతికింది ఇదే.

* ఈ డైనోపేరు Torvosaurus gurney . పేరుకుదగ్గట్టే దీని రూపం కూడా చాలా పెద్దదే. ఇది 33 అడుగుల పొడవుండేదిట. అంటే స్కూలు బస్సుకన్నా చాలా ఎక్కువన్నమాట. ఈ భారీ డైనో బరువు 4 నుంచి 5 టన్నులు ఉండేది. అంటే దాదాపు రెండు ఏనుగుల బరువుతో సమానం. దీని దవడలు నాలుగడుగుల పొడవుండేవి. శరీరం కొలతలకు తగ్గట్టే దీని ప్రవర్తన కూడా భయంకరమే.

* ఈ డైనోకు 11 పళ్లు ఒక్కోటీ 4 అంగుళాలతో కత్తుల్లా ఉండేవి. వాటితో కనపడ్డ జంతువునల్లా ఇది కొరుక్కుతినేది. చివరికి ఇది శాకాహార డైనోసార్లను కూడా కరకరలాడించేదిట!

* ఇంతకీ దీని గురించి ఇన్ని సంగతులు ఎలా తెలిశాయి? అంటే ఈ డైనో శిలాజాలు ఈ మధ్య పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌ సమీపంలో దొరికాయి. వాటిని శాస్త్రవేత్తలు కంప్యూటర్లలో పరిశీలించి, ఈ డైనో రూపురేఖలు గీయగలిగారు.

* ఈ రాకాసి డైనో కన్నా పెద్ద శరీరంతో బతికిన మాంసాహార డైనోసార్లు ఉన్నాయి. కానీ 15 కోట్ల ఏళ్ల క్రితం ఇది బతికిన కాలంలో దీనంత పెద్ద మాంసాహార రాకాసి బల్లులేవీ లేవు. ఈ జాతి అంతరించిపోయాక కోట్ల ఏళ్ల తర్వాత అవి పుట్టుకొచ్చాయి.

* ఈ డైనోసార్‌ తిరగాడినప్పుడు ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదిట. ఎటుచూసినా పచ్చటి పరిసరాలు, నదులు, సెలయేళ్లతో ఎంతో అందంగా ఉండేది. ఈ డైనోతోపాటు అప్పుడు బోలెడు శాకాహార, ఎగిరే డైనోలు, ఇంకా మొసళ్లు, తాబేళ్లు, ఎలుకంత పరిమాణంగల రకరకాల క్షీరదాలు కూడా తిరగాడేవి.

  • ============================
 Visit my website : Dr.Seshagirirao.com _ 

No comments:

Post a Comment

Thanks for your comment !