- ============================
Collection of some animals for children for fun(in Telugu). పిల్లల కోసము కొన్ని జంతువుల విశేషాల సేకరణ
Saturday, October 19, 2013
Hippopotamus - నీటిగుర్రాలు
Thursday, October 17, 2013
dracula bat ,డ్రాకులా గబ్బిలం
రాత్రి కాగానే బయల్దేరుతుంది... నిద్రపోతుంటే దగ్గరకొస్తుంది... కోరలు దించి గాయం చేస్తుంది... కావలసినంత రక్తం తాగుతుంది... ఏమిటది? దెయ్యమా? కాదు ఓ గబ్బిలం!
డ్రాకులా ఎవరో తెలుసుగా? రాత్రి వేళ మాత్రమే కనిపించే రక్త పిశాచి. కోరలతో గాయం చేసి రక్తం పీల్చే దీనిపై ఎన్నో కథలు, సినిమాలు ఉన్నాయి. అచ్చం అలాంటి కోరలు, లక్షణాలు ఉన్న జీవి ఒకటుంది. అదే 'వాంపైర్ బ్యాట్'. వాంపైర్ (vampire)అంటే రాత్రివేళ తిరుగుతూ నిద్రపోతున్న వారి రక్తం పీల్చే పిశాచి అని అర్థం. ఈ గబ్బిలం కూడా అలాంటిదే!
* గబ్బిలాల్లో సుమారు 1200 జాతులుంటే, కేవలం రక్తం మాత్రమే తాగి బతికేది ఇదొక్కటే!
* డ్రాకులా సినిమాలకు హాలీవుడ్ ప్రసిద్ధి అయితే, ఈ వాంపైర్ గబ్బిలం కూడా అమెరికాలోనే ఉండడం విశేషం.
* రక్తపిశాచితో పోలుస్తున్నామని ఇది భారీ ఆకారంతో ఉంటుందనుకోకండి. కేవలం మూడున్నర అంగుళాల పొడవుంటుందంతే. మహా అయితే 60 గ్రాముల బరువు తూగదు!
* విచిత్రం ఏంటంటే ఇది రక్తం పీలుస్తున్నా నిద్రపోతున్న జంతువుకి ఏమీ తెలియదు! దీని లాలాజలం వల్ల ఆ జంతువు చర్మం మొద్దుబారుతుంది.
* కూల్‌డ్రింక్ తాగే స్ట్రాలాగే దీని నాలుక కూడా ఉంటుంది.
* మిగతా గబ్బిలాలకు భిన్నంగా ఇది నేలపై నడవగలదు. అవసరమైతే పరిగెడుతుంది కూడా. అందుకు ఇది తన రెక్కల్ని ముడుచుకుని కాళ్లగా మార్చుకోగలదు.
* రాత్రి వేళ వేటకు బయల్దేరగానే ఇది నిద్రపోతున్న ఆవులు, గుర్రాలు, పందుల్లాంటి జంతువులను పసిగడుతుంది. వాటికి దూరంగా నేలపై వాలి నడుచుకుంటూ వాటిపైకి ఎక్కి రక్తం పీల్చుకుంటుంది.
* జంతువుల చర్మానికి ఆనుకున్న నరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోగల వాసన శక్తి దీనికి ఉంటుంది. సరిగ్గా అక్కడే గాయం చేసి నాలుకను చొప్పించగలదు. వైద్యపరీక్షల్లో నరంలోకి ఇంజెక్షన్ సూది గుచ్చి రక్తాన్ని లాగినట్టన్నమాట.
* ఇంతాచేసి ఇవి తాగేది కేవలం రెండు చెంచాల రక్తం మాత్రమే. వరసగా రెండు రాత్రులు రక్తం దొరక్కపోతే ఇవి చనిపోతాయి!
* ఒక ఏడాదిలో ఈ వాంపైర్ గబ్బిలాలు 100 కలిసి 25 ఆవుల మొత్తం రక్తాన్ని పీల్చేస్తాయని అంచనా!
* వీటిలో మూడు జాతులు ఉన్నాయి.
- ============================
Red Panda,రెడ్ పాండా
రోజుకు 16 గంటలు...తింటూనే ఉంటుంది!బొజ్జ నిండిపోగానే...బజ్జుండిపోతుంది! ఏమిటది?
చూడ్డానికి టెడ్డీబేర్ లాగా ఉంటుంది. పెద్ద తల, గుండ్రటి చిన్ని చెవులు, బొద్దుగా ఉండే ఒళ్లు. ఎర్రగా, బుర్రగా కనిపించే ఇది 'రెడ్ పాండా'
* ప్రపంచంలో రెండే రెండు పాండా జాతులున్నాయి. వాటిలో చిన్నది ఇదే. రెండడుగుల ఎత్తుగా మనింట్లో తిరిగే పిల్లిలా ఉంటుంది.
* ఒట్టి తిండిపోతు. రోజులో 16 గంటలు తింటూనే ఉంటుంది! పగలంతా చెట్లపై కునుకుతీసి రాత్రంతా మేత మేస్తుంది!
* ఇంతా చేసి తినేదేంటో తెలుసా? ఎక్కువగా వెదురు ఆకులే. రోజుకు రెండు లక్షల వెదురు ఆకుల్ని ఆంఫట్ మని లాగించేస్తుంది! ప్రపంచంలో ఒకే రకం ఆహారంపై బతికేది ఇదొక్కటే!
* తోక చూశారా! ఎంత పెద్దగా ఉందో! దాదాపు రెండు అడుగులుంటుంది.
* దీనికి బోలెడు పేర్లు. నక్క పోలికలు ఉండటంతో ఫైర్ ఫాక్స్ అంటారు! వెబ్ బ్రౌజర్ ఫైర్‌ఫాక్స్ పేరు దీన్ని బట్టే వచ్చింది. ముదురు రంగులో ఉంటుందని బ్రైట్ పాండా, పిల్లిలా ఉంటుందని క్యాట్ బేర్, లెస్సెర్ పాండా పేర్లతో పిలుస్తారు!
* పాండా అనే పేరు నేపాల్ పదం 'పొన్య'(ponya)నుంచి వచ్చింది! పొన్య అంటే వెదురు తినే జంతువని అర్థం.
* పాపం... దీన్ని బొచ్చు కోసం వేటాడి చంపుతున్నారు! అందుకే ప్రస్తుతం వీటి సంఖ్య కేవలం 2,500 మాత్రమే!
* హిమాలయ ప్రాంతాల్లో, నేపాల్, చైనా, బర్మాలో ఉండే ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి!
* మన దేశంలోని సిక్కిం రాష్ట్ర జంతువు ఇదే!
- ============================
Komodo dragon- కొమడో డ్రాగన్
కొమడో డ్రాగన్ ఒక భయంకర బల్లి... కొమడో డ్రాగన్‌ను చూస్తే గజగజా వణికిపోవాల్సిందే. 10 అడుగుల పొడవు, 140 కేజీల బరువుతో చూడ్డానికి భయంకరమైన రూపం. దీనికి తోడు బలమైన కాళ్లకు పదునైన గోళ్లు. పెద్దపెద్ద జంతువులే కాదు, మనుషుల్ని కూడా కొరుక్కుతినేయగల కొమడో డ్రాగన్ పళ్లతో కరిచిందంటే ఏజీవి అయినా ప్రాణాలు వదలాల్సిందే.
* అయితే ఇన్నాళ్లూ ఈ భారీ బల్లి నోట్లో విషపూరితమైన బ్యాక్టీరియా ఉంటుందని అనుకునేవారు. అది జంతువులను పీక్కు తిన్నాక పళ్ల సందుల్లో చిక్కుకు పోయిన మాంసం ఎక్కువ సేపు నిలువ ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా విషపూరితంగా మారుతుందనుకునే వారు. అందుకే దాన్ని నోటి శుభ్రతలేని జంతువుగా తిట్టుకునేవారు.
* కానీ ఇన్నాళ్లూ దీనిపై ఉన్న మన అభిప్రాయం తప్పని తేలింది. దీని లోపల సహజంగానే విషపు గ్రంథులు ఉంటాయని కొత్తగా బయటపడింది. అది కొరకడం వల్లే జంతువులు చనిపోతున్నాయన్నమాట. ఇది కాటు వేసినప్పుడు గాయం చుట్టూ రక్తం గడ్డ కట్టి, నిదానంగా విషం ఎక్కి జంతువులు చనిపోతున్నాయని తేలింది.
* పైగా మనం ఉదయం బ్రష్ చేసినట్టుగా ఈ బల్లి కూడా మాంసాన్ని ఆరగించాక 15 నిముషాలు నాలుకతో నోరును శుభ్రం చేసుకుంటుంది. పైన దవడని కూడా ఆకులపై రుద్ది శుభ్రపరుచుకుంటుందని దీనిపై చేసిన పరిశోధనలో తేలింది.
* ఈ బల్లులు ఇండోనేసియాలోని కొమడో ఐలాండ్‌తోపాటు అక్కడున్న మరి కొన్ని దీవుల్లో ఉన్నాయి. అంతా కలిపి వీటి సంఖ్య 5000 మించదు.
* ఇవి పెద్దపెద్ద జంతువులను సైతం తినేస్తాయి. నీటి గేదెల దగ్గర నుంచి, పందులు, జింకలు, దొరికితే చివరికి మనుషులను కూడా కరకరలాడించేస్తాయి.
* ఒక కొమడో డ్రాగన్ ఒకేసారి 80 కిలోల మాంసాన్ని ఆంఫట్ అనిపించేయగలదు.
* గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఇవి పరుగెత్తుతాయి.
- ============================
Subscribe to:
Posts (Atom)