Thursday, October 17, 2013

Red Panda,రెడ్‌ పాండా

  •  

  •  


రోజుకు 16 గంటలు...తింటూనే ఉంటుంది!బొజ్జ నిండిపోగానే...బజ్జుండిపోతుంది! ఏమిటది?
చూడ్డానికి టెడ్డీబేర్‌ లాగా ఉంటుంది. పెద్ద తల, గుండ్రటి చిన్ని చెవులు, బొద్దుగా ఉండే ఒళ్లు. ఎర్రగా, బుర్రగా కనిపించే ఇది 'రెడ్‌ పాండా'

* ప్రపంచంలో రెండే రెండు పాండా జాతులున్నాయి. వాటిలో చిన్నది ఇదే. రెండడుగుల ఎత్తుగా మనింట్లో తిరిగే పిల్లిలా ఉంటుంది.

* ఒట్టి తిండిపోతు. రోజులో 16 గంటలు తింటూనే ఉంటుంది! పగలంతా చెట్లపై కునుకుతీసి రాత్రంతా మేత మేస్తుంది!

* ఇంతా చేసి తినేదేంటో తెలుసా? ఎక్కువగా వెదురు ఆకులే. రోజుకు రెండు లక్షల వెదురు ఆకుల్ని ఆంఫట్‌ మని లాగించేస్తుంది! ప్రపంచంలో ఒకే రకం ఆహారంపై బతికేది ఇదొక్కటే!

* తోక చూశారా! ఎంత పెద్దగా ఉందో! దాదాపు రెండు అడుగులుంటుంది.

* దీనికి బోలెడు పేర్లు. నక్క పోలికలు ఉండటంతో ఫైర్‌ ఫాక్స్‌ అంటారు! వెబ్‌ బ్రౌజర్‌ ఫైర్‌ఫాక్స్‌ పేరు దీన్ని బట్టే వచ్చింది. ముదురు రంగులో ఉంటుందని బ్రైట్‌ పాండా, పిల్లిలా ఉంటుందని క్యాట్‌ బేర్‌, లెస్సెర్‌ పాండా పేర్లతో పిలుస్తారు!

* పాండా అనే పేరు నేపాల్‌ పదం 'పొన్య'(ponya)నుంచి వచ్చింది! పొన్య అంటే వెదురు తినే జంతువని అర్థం.

* పాపం... దీన్ని బొచ్చు కోసం వేటాడి చంపుతున్నారు! అందుకే ప్రస్తుతం వీటి సంఖ్య కేవలం 2,500 మాత్రమే!

* హిమాలయ ప్రాంతాల్లో, నేపాల్‌, చైనా, బర్మాలో ఉండే ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి!

* మన దేశంలోని సిక్కిం రాష్ట్ర జంతువు ఇదే!
  • ============================
 Visit my website : Dr.Seshagirirao.com

Komodo dragon- కొమడో డ్రాగన్‌

  •  

  •  
  
కొమడో డ్రాగన్‌ ఒక  భయంకర బల్లి...  కొమడో డ్రాగన్‌ను చూస్తే గజగజా వణికిపోవాల్సిందే. 10 అడుగుల పొడవు, 140 కేజీల బరువుతో చూడ్డానికి భయంకరమైన రూపం. దీనికి తోడు బలమైన కాళ్లకు పదునైన గోళ్లు. పెద్దపెద్ద జంతువులే కాదు, మనుషుల్ని కూడా కొరుక్కుతినేయగల కొమడో డ్రాగన్‌ పళ్లతో కరిచిందంటే ఏజీవి అయినా ప్రాణాలు వదలాల్సిందే.

* అయితే ఇన్నాళ్లూ ఈ భారీ బల్లి నోట్లో విషపూరితమైన బ్యాక్టీరియా ఉంటుందని అనుకునేవారు. అది జంతువులను పీక్కు తిన్నాక పళ్ల సందుల్లో చిక్కుకు పోయిన మాంసం ఎక్కువ సేపు నిలువ ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా విషపూరితంగా మారుతుందనుకునే వారు. అందుకే దాన్ని నోటి శుభ్రతలేని జంతువుగా తిట్టుకునేవారు.

* కానీ ఇన్నాళ్లూ దీనిపై ఉన్న మన అభిప్రాయం తప్పని తేలింది. దీని లోపల సహజంగానే విషపు గ్రంథులు ఉంటాయని కొత్తగా బయటపడింది. అది కొరకడం వల్లే జంతువులు చనిపోతున్నాయన్నమాట. ఇది కాటు వేసినప్పుడు గాయం చుట్టూ రక్తం గడ్డ కట్టి, నిదానంగా విషం ఎక్కి జంతువులు చనిపోతున్నాయని తేలింది.

* పైగా మనం ఉదయం బ్రష్‌ చేసినట్టుగా ఈ బల్లి కూడా మాంసాన్ని ఆరగించాక 15 నిముషాలు నాలుకతో నోరును శుభ్రం చేసుకుంటుంది. పైన దవడని కూడా ఆకులపై రుద్ది శుభ్రపరుచుకుంటుందని దీనిపై చేసిన పరిశోధనలో తేలింది.

* ఈ బల్లులు ఇండోనేసియాలోని కొమడో ఐలాండ్‌తోపాటు అక్కడున్న మరి కొన్ని దీవుల్లో ఉన్నాయి. అంతా కలిపి వీటి సంఖ్య 5000 మించదు.

* ఇవి పెద్దపెద్ద జంతువులను సైతం తినేస్తాయి. నీటి గేదెల దగ్గర నుంచి, పందులు, జింకలు, దొరికితే చివరికి మనుషులను కూడా కరకరలాడించేస్తాయి.

* ఒక కొమడో డ్రాగన్‌ ఒకేసారి 80 కిలోల మాంసాన్ని ఆంఫట్‌ అనిపించేయగలదు.

* గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఇవి పరుగెత్తుతాయి.
  • ============================ 
Visit my website : Dr.Seshagirirao.com _

Friday, August 30, 2013

Laughing spider,Happy spider,నవ్వేసాలీడు,హ్యాపీ పేస్‌ స్పైడర్‌




సాలెపురుగును చూస్తే చిరాకు పడతాం...కానీ నవ్వే సాలీడు గురించి తెలుసా?దాని ఆకారం చూస్తే మనకూ నవ్వొస్తుంది...

స్మైలింగ్‌ బంతిని చూశారా! నవ్వించే ముఖంతో మెత్తగా పసుపురంగులో ఉంటుంది. అలాంటి రూపురేఖలతో మనల్ని నవ్వించడానికి మన ముందుకొచ్చింది ఓ సాలీడు.

* మనకు కనిపించే సాలీళ్లు చూడ్డానికే వికారంగా ఉంటాయి. ఇది మాత్రం నవ్వించే రూపంతో ఆశ్చర్యపరుస్తుంది. రూపమే కాదు పేరు వింటే కూడా నవ్వొస్తుంది. 'నననా మకాకి' కానీ దీన్నంతా 'హ్యాపీ పేస్‌ స్పైడర్‌ అనే పిలుస్తారు.

* అయితే ఇది నిజంగా నవ్వుతుంది అనుకోకండి. ఈ సాలీడు వీపుభాగంలో కళ్లు, మూతి లాంటి మచ్చలుంటాయి. వాటిని చూస్తే ఇది నవ్వుతున్నట్టు అనిపించి మనకూ నవ్వు పుడుతుంది.

* ఇదుండేది పసిఫిక్‌ సముద్రంలోని హవాయి దీవుల్లో. పైగా ఈ నవ్వు సాలీడు కేవలం 5 మిల్లీమీటర్లు. అంటే భూతద్దం పెట్టి చూస్తేగానీ కనిపించదు.

* దీని వింత ఆకారాన్ని చూసి ఇతర జీవులు దాని జోలికి ఎక్కువగా రావు. శత్రువులకు దీన్ని తినాలో వద్దో అర్థంకాక తెల్లముఖం వేసుకుంటాయి.

* ఈ సాలీళ్లు పసుపు, నీలం, ఎరుపు రంగుల్లో చూడ్డానికి భలే ముచ్చటగా ఉంటాయి.

* దీనిత శాస్త్రీయనామం 'థెరిడినో గ్రాల్లటర్‌' వీటి కాళ్లు దృఢంగా పొడవుగా ఉంటాయి.

* అతి తక్కువ సంఖ్యలో ఉండే దీన్ని మొదటిసారిగా 1973లో గుర్తించారు.

* స్థానికులకు ఇదంటే ఎంతో ఇష్టం. అందుకే వీటి బొమ్మల్ని టీషర్ట్స్‌, బేస్‌బాల్‌ క్యాప్స్‌, పోస్ట్‌కార్డులాంటి వాటిపై చిత్రించి వాటి ప్రాముఖ్యతను పెంచుతున్నారట!

* ఈ సాలీడు తినే ఆహారం వల్ల దీని దేహంపై ఉండే గుర్తులు మారుతుంటాయి!

* వీటిల్లో బాధ్యతంతా ఆడవాటిదే. గుడ్లు పెట్టిన దగ్గర నుంచి పిల్లలు పెరిగే వరకు పూర్తిగా తల్లి జీవులే చూసుకుంటాయి!

* ఈ సాలీళ్లు ఎక్కువగా వెయ్యి నుంచి ఆరువేల అడుగుల ఎత్తులో ఉండే చెట్ల ఆకులపై ఉండటానికి ఇష్టపడతాయి.

* చిన్న చిన్న కీటకాలను, పురుగుల్ని తినే ఇది మనుషులకు ఎలాంటి హానీ కల్గించదు.

* ఇవి ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరుకున్నాయి!


  • ============================ 

 Visit my website : Dr.Seshagirirao.com 

Lavasoa dwarf lemur-లావాసో డ్వార్ఫ్‌ లెమర్‌








    లెమర్లు తెలుసు... కోతి ముఖం, పిల్లి రూపంతో వింతగొలుపుతాయి... వీటిల్లో ఒక కొత్త జాతిది బయటపడింది... పైగా ఇదో మరుగుజ్జుది!

గుడ్లగూబ లాంటి కళ్లు, పిడికెడు శరీరం, నక్కలాంటి లావాటి తోక. ఇది కొత్తగా బయటపడ్డ ఓ పొట్టి వానరం. పేరు 'లావాసో డ్వార్ఫ్‌ లెమర్‌'.
* ఇది ఎప్పుడో 12 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తల కంటబడింది. అయితే అసలు ఇది ఏ జాతికి చెందుతుందని చెప్పడానికి ఇన్నేళ్లు పరీక్షలు గట్రా జరిపి ఇప్పుడు ఇది లెమర్‌ జాతిదేనని తేల్చారు. లెమర్లు మొత్తం సుమారు వంద జాతులు. వాటిల్లో అయిదు పొట్టి జాతివి ఉన్నాయి. ఈ పొట్టివాటిల్లో ఈ కొత్తదీ చేరిపోయింది.
* లెమర్లు ఆఫ్రికా దగ్గరలోని మడగాస్కర్‌ దీవిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి.
* ఇక ఈ కొత్త వానరాన్ని లావాసో పర్వతాల్లో గుర్తించారు కనుక 'లావాసో డ్వార్ఫ్‌ లెమర్‌' అనే పేరుపెట్టారు!
* ఇది కేవలం పావుకిలో బరువు, 20 అంగుళాల పొడవుంటుంది. గుండ్రని కళ్లు, చిక్కని బొచ్చు, పెద్ద పెద్ద చెవులతో ఉండే వీటి శరీరం ముదురు ఎరుపురంగులో ఉంటుంది.
* ఇవి రాత్రిళ్లు మాత్రమే తిరుగుతాయి. అడవిలో దట్టమైన పొదలపై వీటి కాపురం. చలికాలంలో సోమరిగా నెలలకొద్దీ చెట్లపైనే గడుపుతాయి. మిగితా కాలాల్లో మాత్రం చాలా చురుగ్గా ఉంటాయి!
*వీటి పోలికలు మిగతా లెమర్ల పోలికలకు దగ్గరగానే ఉన్నా, ఓ పట్టాన మనుషుల కంట పడవు. తప్పించుకుపోయే తత్వం ఎక్కువ. అందుకే ఇవి ఎలా జీవిస్తాయో ఎక్కువగా తెలుసుకోవడానికి వీలు కాలేదు.

* ఈ బుల్లి జీవులకు ఇప్పుడు ముప్పువాటిల్లింది. వీటి సంఖ్య చాలా తక్కువ. దాదాపు 50 వరకే ఉన్నాయట! పాపం అంతరించిపోయే దశకు చేరాయి.
* మడగాస్కర్‌ దీవిలో స్థానిక భాషలో 'లెమర్‌' అంటే దెయ్యం అని అర్థం.
* వీటిల్లో అతిపెద్దది ఇంద్రి. ఏడున్నర కిలోల వరకు బరువు పెరుగుతుంది.
* చిన్నది డ్వార్ఫ్‌ మౌస్‌. ఇది కేవలం 10 గ్రాముల బరువుంటుంది.

  • ============================

 Visit my website : Dr.Seshagirirao.com 

Chimpanzee memory-చింపాంజీ జ్ఞాపకశక్తి







    చింపాంజీలు, ఒరాన్‌గుటాన్‌లు తెలుసు... ఈ వానరాలకు మనుషుల్లాగే ఎన్నో తెలివితేటలున్నాయని తెలుసు... వీటికి జ్ఞాపకశక్తి కూడా మెండేనట... ఈ సంగతి కొత్తగా బయటపడింది.

మీరోసారి మీ మావయ్య వాళ్లింటికి వెళ్లారు. అప్పుడో కొత్త రకం సెంటును కొట్టుకున్నారు. మళ్లీ మూడేళ్ల తర్వాత మీరు ఆ సెంటు వాసన చూస్తే వెంటనే పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అది మావయ్య వాళ్లింట్లో వాడినట్టు టక్కున గుర్తొస్తుంది. మనకే కాదు చింపాంజీలు, ఒరాంగుటాన్‌లకు కూడా ఇలాంటి జ్ఞాపకశక్తి ఉందని తేలింది.

* చింపాంజీలు, ఒరాం గుటాన్‌ల తెలివితేటల గురించి ఇది వరకే తెలుసు. చెట్ల కొమ్మల్ని, కర్రల్ని పరికరాల్లా వాడగలవని, వాటితో అవసరమైన వస్తువులను దగ్గరకు లాక్కోగలవని ఎన్నో పరిశోధనల్లో తేలింది. అయితే వీటికి వారం రెండు వారాల విషయాల దగ్గర నుంచీ మూడేళ్ల కిందట జరిగిన సంగతులు కూడా గుర్తుంటాయని ఇప్పుడు కొత్తగా తెలిసింది.

* డెన్మార్క్‌లోని ఆర్హుస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రజ్ఞులు చేసిన జ్ఞాపకశక్తికి సంబంధించిన ఈ పరిశోధన ఆసక్తికరంగా సాగింది.
* మీకేదైనా కొత్త బొమ్మ కొనిస్తే దాన్ని ఎలా వాడాలో తెలీదు. దాని గురించి ఎవరైనా వివరంగా చెబితే చక్కగా ఆడుకుంటారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ బొమ్మను మీకిచ్చినా దాన్ని ఎలా ఉపయోగించాలో మరిచిపోరు. ఇదిగో చింపాంజీలు, ఒరాంగుటాన్‌ల జ్ఞాపకశక్తిని తెలుసుకోవడానికి కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. ఇంతకీ ఏం ప్రయోగం?

* వీటి ముందు వేరు వేరు డబ్బాల్లో కొన్ని రకాల పరికరాలు పెట్టారు. వాటిల్లో కొన్ని వీటికి పనికొచ్చేవి, కొన్నేమో ఎందుకూ ఉపయోగపడనివి. ఈ జంతువులకు పనికొచ్చే వస్తువులను ఎలా వాడాలో కూడా కిటుకు తెలిసేలా అక్కడ ఏర్పాట్లు చేశారు. పైగా వీటికి చూపిన పరికరాల గురించి అంతకుముందు వీటికి అస్సలు తెలియదు. మళ్లీ మూడేళ్ల తర్వాత అవి వాడిన పరికరాలను వాటి ముందు పెట్టి, పరిశోధకులు కనిపించకుండా దాక్కున్నారు. వెంటనే ఒరాంగుటాన్‌లు, చింపాంజీలు మూడేళ్ల క్రితం వాడిన దానికన్నా వేగంగా ఆ పరికరాలను వాడాయి. అంటే ఆ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో గుర్తుంచుకున్నాయన్నమాట.

* ఈ వానరాల జ్ఞాపకశక్తి చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు.
* ఇదే కాదు రకరకాల తీర్లలో వీటి జ్ఞాపకశక్తిని పరీక్షించారు. ఎలా అంటే ఇవి గతంలో విన్న ధ్వనులు, వాసనలు వీటిపై ప్రయోగించారు. దీంట్లోనూ దాని జ్ఞాపకశక్తిని నిరూపించుకున్నాయి. మొత్తానికి చింపాంజీలకు, ఒరాంగుటాన్‌లకు తెలివితోపాటు జ్ఞాపకశక్తి కూడా బోలెడని తెలిసింది కదూ!

  • ============================

 Visit my website : Dr.Seshagirirao.com _ 

టాన్స్‌ట్రోఫియస్‌ - tanystropheus










    బల్లిలాంటి రూపం... 10 అడుగుల మెడ... నాలుగు కాళ్లతో నడక.
జంతువుల్లో దేని మెడ పొడవైనది అంటే టక్కున జిరాఫీదని చెబుతారు. కానీ అంతకన్నా చాలా పొడవైన మెడ జీవి ఒకటి ఉంది. అదే టాన్స్‌ట్రోఫియస్‌ (tanystropheus). గ్రీకులో ఈ పేరుకు అర్థం పొడవైనది అని.

* ఈ వింత జీవి ఎక్కడ ఉందో చూసొచ్చేస్తే పోలా అనుకోకండి. ఇదిప్పుడు లేదు. ఎప్పుడో 23 కోట్ల ఏళ్ల క్రితం అంటే డైనోసార్లు తిరిగినప్పుడు భూమిపై తిరగాడుతుండేది.
* ఈ వింత జీవి శరీరం పొడవు 20 అడుగులు ఉంటే అందులో మెడే 10 అడుగులు ఉండేది. ఆ మెడను ఎలాగంటే అలా మెలికలు తిప్పడం కూడా దీని ప్రత్యేకత.
* చూడ్డానికి డైనోసార్‌ పోలికలున్నా కానీ ఇది డైనో కాదు. సరీసృపం. ఇప్పుడు మనం చూస్తున్న బల్లులకు ముత్తాతలాంటిదేనట.

* ఐరోపా ప్రాంతంలో తిరగాడేదిట. దీని శిలాజాలు అప్పుడెప్పుడో 1855లోనే దొరికాయి. కానీ దీని మెడ ఇంతలా పొడవు ఎందుకు ఉండేదని ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరూ సరిగా చెప్పలేకపోతున్నారు. కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం నీటి లోపలికి తలపెట్టి చేపలు తినడం వల్ల క్రమేణా ఇలాంటి మెడ ఏర్పడిందని భావిస్తున్నారు.
* ఈ పొడవు మెడ జీవి చాలా బద్ధకస్తురాలు. నేలపైన చాలా నెమ్మదిగా నడవడమే కాదు, నీళ్లలో ఈత కూడా మెల్లగా ఉండేది.
* అప్పట్లో డైనోలు వీటిని చూస్తే ఆంఫట్‌ అనిపించేవి.
* బల్లులకు తోకలు తెగితే మళ్లీ పుట్టుకొస్తాయిగా? అలాగే దీనికి కూడా తోక తెగితే కొత్తగా వచ్చేదిట.
* ఇక వీటి పళ్లు చాలా పదునుదేలి ఉండేవి. వాటితో చేపల్ని చిన్న చిన్న జలచరాల్ని, నేలపైన కీటకాల్ని గుటుక్కుమనిపించేవి.
* రోజులో ఎక్కువ సేపు నీటిలోనే ఉండేవి.
* దీనికి నాలుగు కాళ్లు ఉండేవి.
* ఈ పొడవు మెడ జీవులు ఎక్కువ గుంపులుగానే తిరిగేవట.

  • ============================

 Visit my website : Dr.Seshagirirao.com _