Friday, March 28, 2014

Africa Lions,ఆఫ్రికా సింహాలు



 సింహాలకు చిరునామా ఆఫ్రికా...ఆ ఫ్రికా అంటేనే అడవులు గుర్తొస్తాయి. ఆ ఖండంలో దక్షిణ ప్రాంతంలో చిక్కనైన, దట్టమైన అడవులు ఎక్కువగా కనిపిస్తాయి. ఒకప్పుడు ఇదంతా సింహాల నిలయం. వాటి గర్జనలు మారుమోగేవి. మరిప్పుడో? ఆ వైభవమే లేదు. మృగరాజుల సంఖ్య చాలా తగ్గిపోయింది. శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే అవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.
* శాస్త్రవేత్తలు ముఖ్యంగా మగ సింహాల లెక్కలు తెలుసుకోవడానికి గత ఆరేళ్లు సెనెగల్‌ నుంచి నైజీరియా వరకు 11 దేశాల్లో దాదాపు 2,414 కిలోమీటర్లు సర్వే చేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో వేలాది మగ సింహాలు తిరగాడేవి. కానీ ఇప్పుడు కేవలం 250 మాత్రమే ఉన్నట్టు లెక్కతేలింది.
* సింహాల్లో జాతులుంటాయని తెలుసుగా? అలా ఇప్పుడు 'పాంథరా లియో' అనే జాతి సింహాల గురించి ఆరాతీశారు. వీటిల్లో మగవైతే ఏకంగా 8 అడుగుల పొడవు, 250 కేజీల వరకు బరువు పెరుగుతాయి. గంటకు 59 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు.
* కొన్నేళ్ల క్రితం వీటి సంఖ్యను లెక్కగడితే దాదాపు 1300 ఉన్నాయని తేలింది. కానీ ఇప్పుడు వీటి సంఖ్య మరింత తగ్గింది.
* అయినా సింహాల సంఖ్య ఎందుకు తగ్గుతున్నట్టు? అంటే అడవుల్ని కొట్టేయడం, వేటాడటం, ఇవి తిరగడానికి అనువైన పరిస్థితులు లేకపోవడం, పరిరక్షణ చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల వీటి సంఖ్య చాలా తగ్గిపోయింది.

* మగ సింహం గర్జిస్తే 8 కిలోమీటర్ల వరకు ఆ ధ్వని వినిస్తుంది!
* సింహాలు ఎక్కువగా పెద్ద జంతువులైన జీబ్రాలు, అడవి దున్నలనే వేటాడతాయి!
* సింహాలు 10 నుంచి 15 సమూహంగా తిరుగుతాయి. ఈ గుంపును Pride అంటారు.
* ఆడవి రోజుకు 5 కేజీల మాంసాన్ని తింటే, మగవి 7 కిలోల మాంసాన్ని లాగించేస్తాయి!
* సింహాలకు ఈత కూడా వచ్చు!
* వేగంగా పరిగెడుతూ ఒకేసారి 36 అడుగుల దూరం దూకగలవు!

============================
 Visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment

Thanks for your comment !